దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీ శృంగేరి జగద్గురు ప్రవచన మందిరం ఎదుట కనకదుర్గా నగర్‌లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద దుర్గంధం వెదజల్లుతోంది. ఏడు విక్రయ కేంద్రాలు ఒక్క కనకదుర్గా నగర్‌లోనే ఏర్పాటు చేశారు. కొండపై వీఐపీల కోసం ఒక కౌంటర్, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో, అర్జున వీధిలో తాత్కాలిక డేరాలు వేసి ప్రసాద విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విక్రయ కేంద్రాల పక్కనే దాదాపు 15 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. పారిశుధ్య సమస్యతో ఆప్రాంతం అంతా దుర్గంధం వ్యాపిస్తోంది. ప్రసాదం టిక్కెట్లు తీసుకొని, ఏడు ప్రసాద క్యూ లైన్లలో నిలబడిన భక్తులు ముక్కుమూసుకొని రెండు మూడు మెలికలు తిరిగితేగానీ ప్రసాదం దొరకని పరిస్థితి. ఎంతో పవిత్రంగా భావించే అమ్మ ప్రసాదం దుర్గంధం వస్తున్న చోట విక్రయించడం దురదృష్టకరమని భక్తు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ప్రసా దం కోసం ఇన్ని తిప్పలు పడాలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై విధుల్లో ఉన్న దేవస్థాన అధికారులను ప్రశ్నించగా, పదిహేనేళ్ల నుంచి ఇక్కడే ప్రసాద విక్రయ కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నామని, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఉంటుందని సమాధానం దాటవేశారు. దుర్గంధం వస్తున్న చోట వేరే శాఖల వారు విధులు నిర్వర్తిస్తున్నారు. త మకు వాసన రావట్లేదు కాబట్టి అంతా బాగానే ఉందని చెప్పటం ఎంతవరకు సబబని మిగిలిన శాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు.
No comments:
Post a Comment